Andhra
దర్గా రొట్టెల పండుగ బందోబస్తు పరిశీలన
Quick Summary:
దర్గా రొట్టెల పండుగ బందోబస్తు పరిశీలించిన ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి
అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన నెల్లూరు బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ–2026కు పోలీస్ శాఖ చేపట్టిన పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను శనివారం గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వాజెండ్ల సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దర్గా ప్రాంగణం, క్యూ లైన్లు, స్వర్ణాల చెరువు ఘాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ప్రదేశాలను వారు నిశితంగా తనిఖీ చేసి సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ.. రొట్టెల పండుగను భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంత వాతావరణంలో విజయవంతం చేయడమే పోలీస్ శాఖ లక్ష్యమన్నారు. విధుల్లో ఉన్న సిబ్బంది మానవతా దృక్పథంతో, మర్యాదగా వ్యవహరించాలన్నారు. ముఖ్యమైన ‘గంధ మహోత్సవం’ వేళ రాత్రి బందోబస్తు మరింత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. దర్గా పరిసరాలను 96 సీసీ కెమెరాలు, 26 డ్రోన్ కెమెరాల ద్వారా కంట్రోల్ రూమ్ నుండి 24 గంటల పాటు నిఘా ఉంచినట్లు తెలిపారు.దొంగతనాల నివారణకు సీసీఎస్ బృందాలు రంగంలోకి దిగాయని, కేటాయించిన స్థలాల్లోనే వాహనాల పార్కింగ్ జరిగేలా చూడాలని ఆదేశించారు. విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఐజీ హెచ్చరించారు బాంబ్, డాగ్ స్క్వాడ్‌లతో నిరంతర తనిఖీలు చేయిస్తున్నట్లు ఎస్పీ అజిత వాజెండ్ల వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు CH సౌజన్య, AV అప్పారావు, ఏఎస్పీ దీక్ష , డీఎస్పీలు ఘట్టమనేని శ్రీనివాసరావు, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.