ఇందుకూరుపేట, జూలై 1 (ప్రజా అంతరంగం)
మండల పరిధిలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన మైపాడు బీచ్ తీరంలో బుధవారం పర్యాటకులు, స్థానికుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనపై బాధితులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నెల్లూరు బారాషహీద్ దర్గా రొట్టెల పండుగను పురస్కరించుకుని దేశ, విదేశాల నుంచి ఎంతోమంది ముస్లిం భక్తులు జిల్లాకు వస్తుంటారు. దర్గాను దర్శించుకున్న అనంతరం పర్యాటక ప్రాంతమైన మైపాడు బీచ్‌కు వచ్చే యాత్రికులను ప్రతి ఏటా స్థానికంగా ఉన్న కొందరు వ్యక్తులు ఏదో ఒక తప్పుడు ఆరోపణలతో ఇబ్బందులకు గురిచేయడం, దాడులకు దిగడం పరిపాటిగా మారిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలో ఎలాంటి చిన్న సమస్యలు ఉన్నా సర్దిచెప్పి పర్యాటకులకు అండగా నిలవాల్సిన బాధ్యత గల స్థానిక పెద్దలే కొందరు ఇలాంటి దాడులను ప్రోత్సహించడం, దురుసుగా ప్రవర్తించడంపై పర్యాటక వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పండుగ రోజుల్లో మైపాడు బీచ్ తీరానికి వచ్చే భక్తులు, పర్యాటకుల భద్రత దృష్ట్యా పోలీసు శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పర్యాటకులు డిమాండ్ చేస్తున్నారు.
Andhra
మైపాడు బీచ్ తీరంలో ఉద్రిక్తత... పర్యాటకులపై స్థానికుల దాడి?
Quick Summary:
రొట్టెల పండగ భక్తులపై దురుసు ప్రవర్తనపై ఆవేదన