Andhra
బారాషాహిద్ దర్గా వద్ద ఉద్రిక్తత
Quick Summary:
పోలీసులు V/S రెవెన్యూ అధికారులు
మతసామరస్యానికి ప్రతీకగా సాగుతున్న నెల్లూరు బారాషాహీద్ దర్గా రొట్టెల మహోత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. అధికారుల మధ్య సమన్వయ లోపం కాస్తా.. రెవెన్యూ వర్సెస్ పోలీస్ వివాదానికి దారితీసింది. దర్గా మొదటి గేటు వద్ద విధి నిర్వహణలో ఉన్న నెల్లూరు రూరల్ తహసిల్దార్ పట్ల ఒక సీఐ అత్యంత దురుసుగా మరియు అనుచితంగా ప్రవర్తించారని తహసిల్దార్ స్వయంగా ఆరోపించారు. పండుగ బందోబస్తు, భక్తుల రద్దీని క్రమబద్ధీకరించే క్రమంలో ఈ ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. తన పట్ల సీఐ వ్యవహరించిన తీరును నిరసిస్తూ, తహసిల్దార్ కు మద్దతుగా నెల్లూరు రూరల్ ఎమ్మార్వో కార్యాలయ రెవెన్యూ సిబ్బంది అంతా ఏకతాటిపైకి వచ్చారు. పెద్ద ఎత్తున దర్గా మొదటి గేటు వద్దకు చేరుకున్న సిబ్బంది, పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దర్గా ప్రధాన గేటు వద్దే ఆందోళన చేస్తూ బైఠాయించేందుకు రెవెన్యూ ఉద్యోగులు ప్రయత్నించడంతో పండుగకు వచ్చిన భక్తులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. లక్షలాది మంది భక్తులు ఉన్న ప్రాంతంలో ఇలా రెండు కీలక ప్రభుత్వ శాఖల అధికారులు ఘర్షణకు దిగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సమాచారం అందుకున్న ఉన్నత స్థాయి పోలీస్, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను శాంతింపజేసే ప్రయత్నాలు చేస్తున్నారు.