వెంకటగిరి పట్టణం, జూలై 1 (ప్రజా అంతరంగం)
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెల ఒకటో తేదీనే, ఉదయం 7 గంటలకల్లా లబ్ధిదారుల ఇంటి ముంగిటకే పింఛన్లు అందిస్తున్న ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వానిదేనని వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. బుధవారం వెంకటగిరి పట్టణ పరిధిలోని 24వ వార్డులో నిర్వహించిన ‘ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ’ కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొన్నారు. వార్డులోని లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి పెంచిన పింఛన్ నగదును అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో పింఛన్ల కోసం వృద్ధులు, అవ్వాతాతలు ఎండలో గంటల తరబడి నిలబడి ఇబ్బందులు పడేవారని, ఆ పరిస్థితిని మారుస్తూ కూటమి ప్రభుత్వం ఒకటో తేదీ ఉదయమే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు సిబ్బందిని పంపి పంపిణీ చేస్తోందన్నారు. పేదల ఆర్థిక ఇబ్బందులను తొలగించేందుకు రాష్ట్రంలో సాధారణ పింఛన్‌ను ₹4 వేలకు పెంచామని, దివ్యాంగులకు ₹6 వేల వరకు, అలాగే కొన్ని ప్రత్యేక కేటగిరీల వర్గాలకు ₹10 వేల నుండి గరిష్టంగా ₹15 వేల వరకు పెంచిన మొత్తాన్ని అందిస్తున్నామని స్పష్టం చేశారు.
కేవలం సంక్షేమ పథకాలకే పరిమితం కాకుండా, రాష్ట్రంలో నూతన పరిశ్రమల స్థాపన ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాల కల్పన మరియు మౌలిక వసతుల అభివృద్ధికి కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే రామకృష్ణ పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా వార్డు స్థాయి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.
Andhra
ప్రతి నెల 1నే ఇంటి వద్దకు పింఛన్ల పంపిణీ - ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ
Quick Summary:
వెంకటగిరి 24వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ