పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం - ఎమ్మెల్యే కాకర్ల సురేష్
కొండాపురం, జూలై 1 (ప్రజా అంతరంగం)
పేద ప్రజల సంక్షేమం, గ్రామాభివృద్ధి మరియు స్వచ్ఛతకు ప్రతీకగా ఆదర్శ గ్రామాలను తీర్చిదిద్దడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ అన్నారు. కొండాపురం మండలం గొట్టిగుండాల గ్రామంలో బుధవారం నిర్వహించిన 'పేదల సేవలో' ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లిన ఎమ్మెల్యే, స్వయంగా వారి చేతుల మీదుగా పింఛన్ నగదును అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ సహకారం, మంత్రి నారా లోకేష్ సమర్థ నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమ పాలనకు కొత్త నిర్వచనం ఏర్పడిందన్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా వృద్ధులకు ₹4,000, వికలాంగులకు ₹6,000, డయాలసిస్ బాధితులకు ₹10,000, ప్రత్యేక అవసరాలున్న వారికి గరిష్టంగా ₹15,000 వరకు పెంచిన ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు.
రూ.8 లక్షలతో స్వచ్ఛ ట్రాక్టర్ ప్రారంభం
'స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర' కార్యక్రమంలో భాగంగా గొట్టిగుండాల గ్రామ పంచాయతీలో వ్యర్థాల సేకరణ, గ్రామ పరిశుభ్రతను మెరుగుపర్చేందుకు సుమారు రూ.8 లక్షల వ్యయంతో మంజూరైన స్వచ్ఛ ట్రాక్టర్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ ట్రాక్టర్ ద్వారా గ్రామంలో పారిశుధ్య నిర్వహణ మరింత సమర్థవంతంగా సాగి, పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు.
వి.పి.ఆర్ అమృతధార వాటర్ ప్లాంట్ ప్రారంభం
నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో, విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమలవుతున్న 'వి.పి.ఆర్ అమృతధార' కార్యక్రమం కింద గొట్టిగుండాల గ్రామంలో నూతనంగా నిర్మించిన శుద్ధి చేసిన తాగునీటి వాటర్ ప్లాంట్‌ను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్లాంట్ ప్రారంభంతో ఉదయగిరి నియోజకవర్గ పరిధిలో మొత్తం 37, నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 200 వాటర్ ప్లాంట్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు. కొండాపురం మండలంలోనే ఇప్పటికే 7 వాటర్ ప్లాంట్లను పూర్తి చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తున్నామన్నారు.
విపిఆర్ ఫౌండేషన్ సేవలపై ప్రశంసలు
సామాజిక సేవా రంగంలో విపిఆర్ ఫౌండేషన్ అందిస్తున్న సేవలు అత్యంత ఆదర్శప్రాయమైనవని ఎమ్మెల్యే కొనియాడారు. ఫౌండేషన్ ద్వారా జిల్లావ్యాప్తంగా దివ్యాంగుల కోసం 1,037 ట్రైసైకిళ్లను పంపిణీ చేయగా, అందులో ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన 169 మంది దివ్యాంగులకు అందజేశామన్నారు. అలాగే 'విపిఆర్ నేత్ర' కార్యక్రమం ద్వారా జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 77,825 మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి, 45,050 మందికి కంటి అద్దాలు ఇచ్చారని తెలిపారు. ఇందులో ఒక్క ఉదయగిరి నియోజకవర్గంలోనే 47,434 మందికి కంటి పరీక్షలు చేసి, 26,423 మందికి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే వివరించారు. ప్రజల ఆరోగ్యం, సంక్షేమం, జీవన ప్రమాణాల మెరుగుదలకు ఈ సేవలు ఎంతగానో దోహదపడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి పార్టీల ముఖ్య నాయకులు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, విపిఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Andhra
పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం - ఎమ్మెల్యే కాకర్ల సురేష్
Quick Summary:
గొట్టిగుండాలలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ