తోటపల్లిగూడూరు, జూలై 1 (ప్రజా అంతరంగం)
తాను అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే, గతంలో కానీ ప్రస్తుతం కానీ తోటపల్లిగూడూరు మండలం సర్వతోముఖాభివృద్ధి చెందిందని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ భరోసా వృద్ధాప్య, వికలాంగుల పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా తోటపల్లిగూడూరు మండలం పోట్లపూడి గ్రామంలో బుధవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. లబ్ధిదారులకు పింఛన్లు అందజేసిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇందులో భాగంగా తోటపల్లిగూడూరు మండలంలోనే ఈ నెల ఒక్కరోజే రూ.3 కోట్ల 13 లక్షలు, ఒక్క పోట్లపూడి గ్రామంలోనే రూ.20 లక్షల 38 వేల పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టామని సోమిరెడ్డి వివరించారు. మొత్తం సర్వేపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా చూస్తే ప్రతి నెలా సుమారు రూ.190 కోట్లు కేవలం పింఛన్ల కోసమే ప్రభుత్వం ఖర్చు చేస్తోందని గణాంకాలతో వెల్లడించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో సంక్షేమ పథకాలకు క్షేత్రస్థాయిలో ఎంత ఖర్చు చేసిందో బహిరంగంగా చెప్పాలని ఈ సందర్భంగా ఆయన సవాల్ విసిరారు.
పోట్లపూడి అభివృద్ధికి నిధుల వరద
పోట్లపూడి గ్రామంలో తమ హయాంలో జరిగిన, జరగబోయే అభివృద్ధి పనులను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లబ్ధిదారులకు వివరించారు. గ్రామంలో నూతన పంచాయతీ భవన నిర్మాణానికి రూ.32 లక్షలు, విలేజ్ హెల్త్ క్లినిక్ (ఆరోగ్య కేంద్రం) కొరకు రూ.36 లక్షలు, స్థానిక శివాలయ పునరుద్ధరణకు కామన్ గుడ్ ఫండ్ కింద రూ.40 లక్షలు, అలాగే అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు కేటాయించామని స్పష్టం చేశారు. కేవలం ఒకే ఒక్క గ్రామానికి రూ.1.13 కోట్లకు పైగా నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తుంటే.. కొందరు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వంపై చేస్తున్న బూటకపు విమర్శలు మానుకోవాలని వైఎస్సార్‌సీపీ నాయకులకు హితవు పలికారు.
ఈ పింఛన్ల పంపిణీ మరియు పర్యటన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర, తోటపల్లిగూడూరు మండల టీడీపీ అధ్యక్షుడు కొనతం రఘుబాబు, ముఖ్య నాయకులు కోడూరు శ్రీనివాసులు రెడ్డి, స్థానిక నేత ఈదూరు భాస్కర్ మరియు పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Andhra
వాడవాడలా పెన్షన్ పంపిణీ
Quick Summary:
అప్పుడూ ఇప్పుడూ తోటపల్లిగూడూరును అభివృద్ధి చేసింది నేనే